న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : మహారాష్ట్రలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) కూటమిలో ఏర్పడిన లుకలుకలు బహిర్గతమయ్యాయి. ఢిల్లీలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళన్‌లో ఏక్నాథ్ షిండేకు మహాద్జీ షిండే రాష్ట్ర గౌరవ్ పురస్కారాన్ని శరద్ పవార్ తానే స్వయంగా ప్రదానం చేశారు. థాణే, నవీ ముంబై, ముంబై అభివృద్ధి కోసం ఏక్నాథ్ షిండే చేసిన సేవలను పవార్ కొనియాడారు. శరద్ పవార్ సన్మానించింది షిండేను కాదని, అమిత్ షాను సన్మానించినట్టుగానే తాము చూస్తామని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
సీనియర్ రాజకీయ నాయకులైన మిమ్మల్ని గౌరవిస్తామని, కాని బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీని అమిత్ షా సాయంతో చీల్చి మహారాష్ట్రను బలహీనపరిచిన వ్యక్తిని మీరు సన్మానిస్తున్నారని, ఇది మరాఠీ ప్రజల మనోభావాలను గాయపరుస్తుందని శరద్ పవార్‌ను ఉద్దేశించి రౌత్ విమర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదని, ఇది సాహితీ, సాంస్కృతిక వేదికని, రాజకీయ వేదిక కాదని శరద్ వర్గం పేర్కొంది.