ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకూ ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండవద్దని తేల్చి చెప్పింది. ఇళ్లల్లో జరుపుకునే కార్యక్రమాలకు 100 మంది హాజరు కావాలని, బయట జరుపుకునే కార్యక్రమాలకు 250 మంది మాత్రమే హాజరు కావాలని సూచించింది.
అలాగే సినిమా హాళ్లు, స్పా సెంటర్లు, హోటల్స్, జిమ్స్ తదితర వాటిల్లో 50 శాతం కెపాసిటీతో మాత్రమే నడిపించుకోవాలని కూడా పేర్కొంది. ఇక మతపరమైన, రాజకీయపరమైన సమావేశాలకు కూడా 100 కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదని నిబంధన విధించింది. న్యూ ఇయర్, క్రిస్మస్ నేపథ్యంలో కూడా మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. మరోవైపు శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో కొత్తగా 20 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం 108 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.