జైపూర్: ఒక వ్యక్తికి ప్రియురాలితో ఉన్న సంబంధం గురించి అతడి భార్యకు తెలిసింది. దీంతో ఆమె ప్లాన్ మేరకు ఆ మహిళను అతడు హత్య చేశాడు. (Man Murders Girlfriend) దీనికి ముందు ఆమె కుమారుడ్ని కూడా దారుణంగా చంపాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేవిలాల్ పర్మార్ అనే వ్యక్తికి సీత అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన ఆమె భర్త తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో నాలుగేళ్ల కుమారుడు ఆ మహిళతో ఉన్నాడు.
కాగా, వివాహితుడైన దేవిలాల్‌కు ముగ్గురు సంతానం. అయితే సీతతో ఉన్న సంబంధం గురించి అతడి భార్యకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె హత్యకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌లో బంధువుల ఇంటికని చెప్పిన దేవిలాల్, సీతను బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో వారిద్దరూ మద్యం తాగారు. ఒక చోట విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా కత్తితో గొంతు కోసి సీతను హత్య చేశాడు. ఆమె చేతిపై తన పేరు పచ్చబొట్టు ఉండటంతో అక్కడి చర్మాన్ని కత్తితో కోశాడు.
మరోవైపు అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు చేసిన పోలీసులు 39 రోజుల తర్వాత సీత హత్య గుట్టును రట్టు చేశారు. కీలక సమాచారం ఆధారంగా దేవీలాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సీతను తానే హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అలాగే ఏడాది కిందట ఆమె నాలుగేళ్ల కుమారుడి తలపై కొట్టి చంపినట్లు చెప్పాడు. ఈ విషయం సీతకు తెలిసినప్పటికీ ఆమె ఫిర్యాదు చేయలేదని పోలీసులకు వెల్లడించాడు.