న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. (Two Teens Charred To Death) మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. షాహ్దారాలోని రామ్ నగర్ ప్రాంతంలో ఎలక్ట్రిక్ ఆటోల కోసం ఛార్జింగ్ పాయింట్ ఉన్నది. అలాగే వాహనాల పార్కింగ్‌తోపాటు గోడౌన్‌గా, చెరకు రసం యంత్రాలను ఉంచే స్టోరేజ్ హౌస్‌గా చిన్న షెడ్‌ను వినియోగిస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం 6.40 గంటల సమయంలో ఆ షెడ్లో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గంటకుపైగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. రాత్రి అక్కడ నిద్రించిన 19 ఏళ్ల బ్రిజేష్, 18 ఏళ్ల మణిరామ్ అగ్నిప్రమాదంలో సజీవ దహనమైనట్లు గుర్తించారు. కాలిన గాయాలైన మరో నలుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలక్ట్రిక్ ఆటోకు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు అగ్నిప్రమాదంలో మరణించిన ఇద్దరితోపాటు కాలిన గాయాలైన నలుగురు యువకులు పలు రాష్ట్రాలకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో చెరకు రసం అమ్ముతూ అక్కడి షెడ్లో నివసిస్తున్నారని చెప్పారు. ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా గోడౌన్ నిర్వహిస్తున్న వినోద్ రాథోడ్‌ను అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.