శ్రీనగర్, ఆగస్టు 10: ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు. అనంత్‌నాగ్ జిల్లా కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో శనివారం ఆర్మీ, జమ్ము కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ కలిసి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు, ఇద్దరు పౌరులకు గాయాలయ్యా యి. దవాఖానకు తరలించగా ఇద్ద రు సైనికులు మరణించారు. మిగిలి న వారు చికిత్స పొందుతున్నారు.
హిమాచల్‌లో ఆకస్మిక వరదలు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం నుంచి మళ్లీ భారీ వర్షాలు కురవడంతో ఆకస్మికంగా వరదలు పోటెత్తాయి. సహాన్లో అత్యధికంగా 168.3 మిల్లీమీటర్లు, కందఘహట్టిలో అత్యల్పంగా 45.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. సహాన్, సంధోల్, నగ్రోటా సూరియన్, ధౌలకువాన్ సహా పలుచోట్ల కొండ చరియలు విరిగిపడటంతోపాటు రోడ్లు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నెల 16 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బద్రీనాథ్ హైవేపై కొండ చరియలు
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. కమెడ, నందప్రయాగ్, చిన్కా ప్రాంతాల్లో కొండ చరియలు పడటం వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రజలు నా మాట వినలేదనే రాజీనామా
జైపూర్: ప్రజలకు 45 ఏండ్ల నుంచి సేవ చేస్తున్నానని, అయినప్పటికీ వారు తన మాట వినలేదని, అందుకే తాను రాజస్థాన్ మంత్రి పదవికి రాజీనామా చేశానని బీజేపీ నేత కిరోడీ లాల్ మీనా చెప్పారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా దౌసాలో ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లను రద్దు చేస్తారనే వార్తలను ఖండించారు. ఈ విషయంలో తాను తన సమాజంతో కలిసి అంకితభావంతో పని చేస్తానని చెప్పారు. తూర్పు రాజస్థాన్‌లో ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ బీజేపీ గెలుస్తుందని, కనీసం ఒక స్థానంలో బీజేపీ ఓడిపోయినా తాను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన గతంలో ప్రకటించారు.