ముంబై, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ముంబై నగరాన్ని ఆనుకొని ఉన్న థానె జిల్లాలో పహల్గాం తరహా దాడి జరిగింది. ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మంగళవారం ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వారి మతం ఏమిటో అడిగి ఆపై కత్తితో పొడిచినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద ‘ఇస్లామిక్ స్టేట్’కు సంబంధించిన పత్రాలు లభించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఘటన జరిగిన కొద్ది సేపట్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడిని ఇది పోలి ఉన్నదని అధికారులు తెలిపారు. అప్పుడు ఉగ్రవాదులు పర్యాటకుల వద్దకు వచ్చి వారిని ఇస్లాం మతానికి సంబంధించిన ‘కల్మా (ప్రార్థన)’ చెప్పాలని ఒత్తిడి చేశారు. కల్మా చెప్పని వారిని విచక్షణారహితంగా కాల్చి చంపారు. తాజా ఘటనలో కూడా నిందితుడు కల్మా చెప్పాలని అన్నాడని, తాము చెప్పకపోవడంతో కత్తితో పొడిచాడని సెక్యూరిటీ గార్డు చెప్పాడు.