చండీగఢ్: ఇంటి బయట ఆడుకుంటున్న పసిపాపను పొరుగింటికి చెందిన రెండు పెంపుడు కుక్కలు ఈడ్చుకెళ్లాయి. ఆ చిన్నారి శరీరంపై పలు చోట్ల కరిచాయి. (dogs bite, drag toddler ) అరుపులు విన్న బంధువు రక్షించడంతో ఆ పసిపాపను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కుటుంబం ఫిర్యాదుపై పెంపుడు కుక్కల యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 22న ఏడాదిన్నర బాలిక సోదరుడితో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్నది. ఇంతలో పొరుగింటికి చెందిన రెండు పెంపుడు కుక్కలు ఆ చిన్నారిని కరిచాయి. పక్కనే ఉన్న షెడ్ వద్దకు ఈడ్చుకెళ్లి దాడి చేశాయి.
కాగా, పసిపాప అరుపులు విన్న బంధువు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. కుక్కల బారి నుంచి ఆ చిన్నారిని కాపాడాడు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు పసి బాలిక కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. పెంపుడు కుక్కల యజమాని సురేంద్రపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చిన్నారిని కరిచిన రెండు కుక్కలను 15 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచుతామని పోలీసులు అధికారి తెలిపారు. కుక్క కరిచిన సంఘటనపై ఫతేహాబాద్ జిల్లాలో కేసు నమోదు కావడం ఇదే తొలిసారి అని చెప్పారు.