న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయ విచారణకు అంతరాయం కలిగించడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (law students arrested) ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాకు చెందిన, లక్నో విశ్వవిద్యాలయంలో మూడో సంవత్సరం న్యాయ విద్యార్థి అయిన 24 ఏళ్ల ప్రబల్ ప్రతాప్ సింగ్, రాయ్‌బరేలికి చెందిన రెండవ సంవత్సరం న్యాయ విద్యార్థి 23 ఏళ్ల చందర్ భాన్ కలిసి జూలై 10న సుప్రీంకోర్టులో హంగామా చేశారు. ప్రబల్ ప్రతాప్ సింగ్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగా కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు.
కాగా, పిటిషనర్ అయిన ప్రబల్ ప్రతాప్ స్వయంగా కోర్టుకు హాజరై గందరగోళం సృష్టించాడు. న్యాయయూర్తులను దుర్షాషలాడటంతో పాటు కోర్టు హాలులో కాగితాలు విసిరేశాడు. అదుపు చేసేందుకు జోక్యం చేసుకున్న భద్రతా సిబ్బందిపై న్యాయ విద్యార్థులు దాడి చేసి వారి విధులను అడ్డుకున్నారు.
మరోవైపు సుప్రీంకోర్టు భద్రతా సిబ్బంది ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల ప్రవర్తనపై సుప్రీంకోర్టు సూచనల మేరకు వైద్య పరీక్షల కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్‌కు తీసుకువెళ్లారు.
అయితే ఇద్దరు న్యాయ విద్యార్థుల మానసిక ఆరోగ్యం బాగానే ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో నిందితులిద్దరినీ రెండు రోజుల పోలీస్ కస్టడీకి తరలించినట్లు చెప్పారు. వారి వద్ద ఉన్న అభ్యంతరకర విషయాల కరపత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.