IAS vs IPS | కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా ఉన్నతాధికారిణులు సోషల్ మీడియా వేదికగా గొడవకు దిగిన విషయం తెలిసిందే. హస్తకళల అభివృద్ధి సంస్థ ఎండీ, ఐపీఎస్ అధికారిణి డీ రూప (D Roopa Moudgil) , దేవాదాయ శాఖ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (Rohini Sinduri) ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం.. ఇద్దరు మహిళా ఉన్నతాధికారులకు తాజాగా షాక్ ఇచ్చింది. రూపా, సింధూరిలను బదిలీ చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి ప్రస్తుతం రాష్ట్ర ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్‌గా (Commissioner of the Hindu Religious Institutions and Charitable Endowment Department) బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారి హెచ్ బసవరాజేంద్రను నియమించింది. మరోవైపు రూప.. కర్ణాటక హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా (Managing Director of the Karnataka Handicrafts Development Corporation) పని చేస్తుండగా.. ఆ స్థానంలో ఐఏఎస్ అధికారిణి డి భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రస్తుతానికి రూపకు, రోహిణి సింధూరికి ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు.
మరోవైపు ఐపీఎస్ అధికారి రూప భర్త మునీష్ మౌద్గిల్ కూడా ఐఏఎస్ అధికారే. తాజా వ్యవహారంతో ప్రభుత్వం ఆయనపై కూడా చర్యలు చేపట్టింది. మునీష్‌ను ప్రచార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ( Principal Secretary of the publicity department) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Karnataka | IPS officer D Roopa Moudgil and IAS officer Rohini Sindhuri transferred without posting after fight on social media over sharing private photos. pic.twitter.com/YdP5QL4OUg
— ANI (@ANI) February 21, 2023
ఐఏఎస్ సింధూరికి చెందిన కొన్ని ఫోటోలను ఐపీఎస్ రూప తన ఫేస్బుక్లో షేర్ చేసింది. ముగ్గురు ఐఏఎస్ మేల్ ఆఫీసర్లకు సింధూరి తన ఫోటోలను పంపి సర్వీస్ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు రూప తన పోస్టులో ఆరోపించింది. సింధూరిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు కూడా రూప తన పోస్టులో పేర్కొంది. దీనిపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు, సీఎస్ వందితా శర్మకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
ఐపీఎస్ రూప ప్రవర్తనతో చిరాకుకు గురైన ఐఏఎస్ సింధూరి ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. తనపై వ్యక్తిగతంగా, తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు సింధూరి ఆరోపించింది. తన వాట్సాప్‌లోని స్క్రీన్షాట్లను తీసి, సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను తీసి.. తనను డీఫేమ్ చేసేందుకు రూప ప్రయత్నించినట్లు సింధూరి ఆరోపించారు. ఐపీఎస్ రూప మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐఏఎస్ సింధూరి ఆరోపించారు. ఆమె వెంటనే కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలన్న సూచన చేశారు.
ఇటీవల ఐఏఎస్ సింధూరి.. జనతాదళ్ ఎమ్మెల్యే సారా మహేశ్‌తో కలిసి ఓ రెస్టారెంట్లో కూర్చున్న ఫోటో వైరల్ అయ్యింది. నిజానికి ఆ ఇద్దరూ తరుచూ అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మైసూరులో కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో ఐపీఎస్ రూప ప్రశ్నలు సంధించింది. ఓ రాజకీయవేత్తతో ఐఏఎస్ సింధూరి ఎందుకు కలిసిందని, ఆ ఇద్దరి మధ్య ఏదో డీల్ కుదిరినట్లు రూప ఆరోపించింది. ఆ ఆరోపణలను సింధూరి కొట్టిపారేసింది.
ఈ వ్యవహాంపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరిపై చర్యలు తప్పవని ఆ రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.