Indigo | ఎయిర్ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో విమానంలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో ప్రయాణికులు తప్పతాగి రచ్చచేశారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది.
ముగ్గురు వ్యక్తులు ఫుల్‌గా మద్యం సేవించి విమానంలో వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేశారు. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన కెప్టెన్‌పై దాడి చేశారు. దీంతో వీరి గురించి విమాన సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్ఎఫ్ అధికారులు వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.