న్యూఢిల్లీ, ఆగస్టు 23: ఉపగ్రహాలను తీసుకెళ్లే రాకెట్లను ప్రయోగించగల సామర్థ్యం ఉన్న ఆరు దేశాల మార్కెట్లలో భారతదేశం అత్యంత ఖరీదైనదని, రాకెట్ ప్రయోగానికి ఇక్కడే అధికంగా ఖర్చు అవుతున్నదని ఇద్దరు విదేశీ ఆర్థికవేత్తలు వెల్లడించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త అలెస్సియో టెర్జీ, ఇటలీకి చెందిన ఆర్థికవేత్త ఫ్రాన్సెస్కో నికోలిలు ప్రఖ్యాత పీర్-రివ్యూడ్ అకడమిక్ జర్నల్ ఎకనమిక్స్ లెటర్స్ సెప్టెంబర్ సంచికలో భారతదేశ ఉపగ్రహానికి అయ్యే భారీ వ్యయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
దాని కథనం ప్రకారం 2025 నాటికి భారత దేశంలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం రాకెట్ల ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించే ఖర్చు కిలోకు రూ.12.7 లక్షలుగా ఉంది. అమెరికాలో ఈ ఖర్చు రూ.3.1 లక్షలు మాత్రమే. కాగా, యూఎస్‌తో పోలిస్తే భారతదేశంలో అయ్యే ఖర్చు నాలుగు రెట్లు అధికం. పరిశీలించిన అన్ని మార్కెట్లలో అమెరికాలోనే ఖర్చు అతి తక్కువగా ఉంది. రష్యా, చైనా, జపాన్‌లతో పోల్చినా భారత్ రాకెట్ ప్రయోగ ఖర్చు అధికంగానే ఉంది. భారత్ తర్వాత కిలోకు రూ.,9.5 లక్షలతో ఐరోపాలో రాకెట్ ప్రయోగ వ్యయం అత్యధికంగా ఉంది.