Hair Surgery : హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ (Hair transplant surgery) వికటించి 48 గంటల్లో ఇద్దరు ఇంజినీర్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రంలోని కాన్పూర్ (Kanpur) సిటీలో మార్చి రెండో వారంలో ఒకే మహిళా డాక్టర్ (Woman doctor) వారికి సర్జరీలు చేశారు. ఆమె నిర్వాకంతో ఇద్దరూ మరణించారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న డాక్టర్ ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వివరాల్లోకి వెళ్తే.. అనుష్క తివారీ అనే మహిళా డాక్టర్ తనకు అర్హతలు లేకపోయినా కాన్పూర్‌లో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వినీత్ కుమార్ దూబే, ప్రమోద్ కతియార్ అనే ఇద్దరు ఇంజినీర్లకు మార్చి రెండో వారంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. అయితే ఆ సర్జరీ వికటించి కేవలం 48 గంటల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంజినీర్ వినీత్ కుమార్ మృతిపై అతడి భార్య జయ త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆలస్యంగా ఫిర్యాదు చేశారనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దాంతో ఆమె చీఫ్ మినిస్టర్‌కు సంబంధించిన గ్రీవియన్స్ సెల్‌ను ఆశ్రయించారు. వారి ఆదేశాల మేరకు పోలీసులు మే 9న కేసు నమోదు చేశారు. డాక్టర్ అనుష్క తివారీ కోసం గాలింపు చేపట్టారు.
ఇవాళ అనుష్క తివారీ తనకు తానే పోలీసుల ముందు లొంగిపోవడంతో ఆమెను కోర్టులో హాజరుపర్చి జైలుకు తరలించారు. కాగా మార్చి 13న వినీత్ కుమార్ దూబేకు డాక్టర్ అనుష్క తివారీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేశారు. దాంతో ముఖమంతా ఉబ్బిపోయింది. దాంతో చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మార్చి 15న ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దాంతో సీఎం గ్రీవియన్స్ సెల్‌ను అశ్రయించారు.