చెన్నై: రెండు దశాబ్ధాలుగా పరారీలో ఉన్న లైంగిక దాడి నిందితుడిని కేరళలోని వంచియూర్ పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. 2001లో తన స్టూడెంట్‌పై లైంగిక దాడికి పాల్పడ్డాడు ముత్తు కుమార్. తిరువనంతపురంకు చెందిన అతను మూడు నెలలు జైలుశిక్ష అనుభవించి ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. కానీ అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారి షానిఫ్ తెలిపారు. స్కూల్ నుంచి స్టూడెంట్ను బయటకు పిలిచి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ముత్తు. ఇక అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అతను క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. శామ్గా తన పేరు మార్చుకున్నాడు. చెన్నైలో చాన్నాళ్లుగా అతను జీవిస్తున్నాడు.
లైంగిక దాడి కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ముత్తు తొలుత నాగర్‌కోయిల్ వెళ్లాడు. అక్కడ సోదరి ఇంట్లో కొన్నాళ్లు ఉన్నాడు. పోలీసులకు తన సమాచారం తెలియడంతో అక్కడ నుంచి టెంకాశీ వెళ్లాడు. కొన్నాళ్లు అక్కడ తన సోదరుడి ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత అతను చెన్నైకి మకాం మార్చాడు. 2007లో కేరళ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. చెన్నైలో అతను ఓ మహిళను పెళ్లి చేసుకుని కుమారుడికి తండ్రి అయ్యాడు. అయితే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు అనేక ప్రయత్నాలు చేపట్టాడు. మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్లు ,డిజిటల్ ఐడెంటి లేకుండా చేసుకున్నాడు. కేవలం పబ్లిక్ ఫోన్లలో మాత్రమే అతను మాట్లాడేవాడు.
మొదటి భార్య చనిపోయిన తర్వాత 2020లో ముత్తు రెండో పెళ్లి చేసుకున్నాడు. క్రైస్తవాన్ని స్వీకరించి ఓ ప్రీస్ట్‌గా మారాడు. మరో వైపు మత్తు ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. అయితే ముత్తు తల్లికి వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఆ కోణంలో ఆరా తీయడం మొదలుపెట్టారు. డబ్బులు పంపిన ప్రతి సారి అతను కొత్త పేరును వాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని ట్రాక్ చేయడం వాళ్లకు ఇబ్బందిగా మారింది. అయితే ముత్తు ఇంటికి వచ్చిన ఓ ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు కేసును చేధించారు. ఆ కాల్ ఆధారంగా చెన్నైలో వేట కొనసాగించారు. నిరంతరం నిఘా పెట్టి అతని సహచరులను ట్రాక్ చేశారు. నెదుమంగడ్ ఎస్సీ,ఎస్టీ కోర్టు ముత్తును రిమాండ్‌లోకి తీసుకున్నది. రేప్, కిడ్నాప్ కేసుల్లో అభియోగాలు మోపింది.