బెంగళూరు, డిసెంబర్ 11: రాత్రివేళ నడుచుకుంటూ వెళ్లిన దంపతులకు బెంగళూరు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. కార్తీక్ పత్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరై రాత్రి 12.30 సమయంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి చేరువలో ఉండగా ఇద్దరు పోలీసులు వారిని అడ్డగించారు. రాత్రి వేళ ఎందుకు రోడ్డుపై వెళ్తున్నారని ప్రశ్నించారు. రాత్రి 11 దాటిన తర్వాత రోడ్డుపై నడవడం తప్పని, రూ.3 వేలు జరిమానా కట్టాలని ఆదేశించారు. దీంతో ఖంగుతిన్న ఆ దంపతులు.. తమకు ఈ నిబంధన తెలియదని, మరోసారి ఇలా చేయబోమని బతిమాలుకున్నారు. ఇంతలో ఆ వ్యక్తిని ఓ పోలీసు పక్కకు తీసుకెళ్లి ‘విషయం ఇంకా పెద్దది చేసుకోకుండా నాకు రూ.వెయ్యి పేటీఎం చేసి వెళ్లిపోండి’ అని బేరం పెట్టాడు. దీంతో రూ.వెయ్యి పేటీఎం చేసి ఆ దంపతులు ఇంటికి చేరారు. తమకు ఎదురైన ఈ సంఘటనను సదరు వ్యక్తి బెంగళూరు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన బెంగళూరు నార్త్ ఈస్ట్ డీసీపీ అనూప్ శెట్టి.. సంపిగహళ్లి పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేశారు.