లక్నో, నవంబర్ 30: ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తోడేళ్లు మనుషులను వేటాడుతున్నాయి. గత శనివారం గంటల వ్యవధిలో జరిగిన తోడేళ్ల దాడులలో ఇద్దరు చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఐదేండ్ల బాలుడు, పదేండ్ల బాలిక ప్రాణాల్ని తోడేళ్లు బలిగొన్నాయి. కైసార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్హాన్పూర్వలో ఇంటిముందు ఆడుకుంటున్న ఐదేండ్ల బాలుడ్ని రెండు తోడేళ్లు చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లాయి. ఖొరియాసఫీక్ గ్రామంలో తన ఇంటి వద్ద నిద్రిస్తున్న రమాదేవి ముగ్గురు పిల్లల్లో 10 ఏండ్ల కుమార్తెను ఓ తోడేలు లాక్కుపోయింది. బహ్రైచ్ జిల్లాలో గత మూడు నెలల్లో తోడేళ్ల దాడులకు 10 మంది బలయ్యారు. మరో 38 మందికి గాయపడ్డారు. తోడేళ్లు ఎక్కువగా చిన్న పిల్లల్నే టార్గెట్ చేయటంతో యూపీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.