Sengottaiyan : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి టీవీకే అధ్యక్షుడు (TVK chief) విజయేనని ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ చీఫ్ కోఆర్డినేటర్ కేఏ సెంగొట్టయ్యన్ (KA Sengottaiyan) చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయ్ (Vijay) నేతృత్వంలోని తమ పార్టీ 234 స్థానాలకుగాను 180 నుంచి 200 నియోజకవర్గాల్లో గెలువబోతున్నదని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మెజారిటీ సాధించదనే పరిస్థితి ఉండదని, తాము మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని ఆయన అన్నారు.
తమ నాయకుడు విజయ్ దూరదృష్టితో పాలన అందిస్తారని సెంగొట్టయ్యన్ చెప్పారు. 2026 ఎన్నికల విజయం తమకు చారిత్రాత్మకమైనదని అన్నారు. విజయ్ రాత్రనక, పగలనక కష్టపడ్డారని, ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారని, మే 4న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో విజయ్ శ్రమకు ఫలితం దక్కబోతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం పొత్తు వార్తలను ఆయన కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అన్నారు.
కాగా ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలిపాయి. అయితే విజయ్ ఈ ఫలితాల అనంతరం కింగ్ మేకర్‌గా నిలుస్తారని టుడేస్ చాణక్య, యాక్సిస్ మై ఇండియా అంచనా వేశాయి. అన్నాడీఎంకే నేృతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ నేపథ్యంలో సెంగొట్టయన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.