న్యూఢిల్లీ, డిసెంబర్ 14: వచ్చే ఏడాది జనవరి నుంచి టెలివిజన్ ధరలు (TV Prices) పెరగనున్నాయి. మెమొరీ చిప్‌ల (Memory Chip) ధర అనూహ్యంగా పెరగడం, రూపాయి విలువ తగ్గి డాలర్‌తో రూపాయి మారకం విలువ 90 రూపాయలను దాటిన కారణంగా టీవీల ధరలు జనవరి నుంచి 3-4 శాతం పెరుగనున్నాయి. రూపాయి పతనం ఈ పరిశ్రమను అస్థిరమైన స్థితిలోకి నెట్టేసింది. టీవీల తయారీకి వినియోగించే విడి పరికరాల్లో 30 శాతం మాత్రమే దేశీయమైనవి కాగా, ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ చిప్స్, మదర్ బోర్డు లాంటి ముఖ్య పరికరాలు దిగుమతి చేసుకుంటున్నారు.
దీనికి తోడు ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో చిప్‌ల సంక్షోభం ఏర్పడటం టీవీల పరిశ్రమను ఇబ్బందుల్లోకి నెట్టింది. మెమొరీ చిప్‌ల పరిశ్రమలో సంక్షోభం కనుక మరో రెండు త్రైమాసికాలు ఇలాగే కొనసాగితే మరోసారి టీవీల ధరలు పెరగడం ఖాయమని ప్రముఖ బ్రాండ్ టీవీల తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో అవ్నీత్ సింగ్ మర్వా తెలిపారు. ఇటీవల టీవీలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల వినియోగదారుడికి కలిగిన ప్రయోజనం ఈ చిప్‌ల సంక్షోభం మింగేస్తున్నదని టీవీ డీలర్ ఒకరు పేర్కొన్నారు.