Accident : ఒడిశా (Odisha) రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ (Bhuvaneswar) లో ఓ తండ్రి, కుమార్తె త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి వారు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఆపై ఓ అరకిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి. భువనేశ్వర్‌లోని పలాసునీ బ్రిడ్జిపై ఈ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకూతుళ్లు కారులో వంతెన దాటుతుండగా వెనుక నుంచి వచ్చిన ఒక భారీ ట్రక్కు దాన్ని బలంగా ఢీకొట్టింది.
ఆ తర్వాత కూడా ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని ఆపకుండా కారును రోడ్డుపై అరకిలోమీటర్కుపైగా ఈడ్చుకెళ్లాడు. దాంతో కారులో ఉన్నవారితోపాటు, రోడ్డుపై ఉన్న ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి తండ్రీకూతుళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్త చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.