న్యూఢిల్లీ, జనవరి 1: హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు సోమవారం మూడు రోజుల ధర్నాను ప్రారంభించారు. భారతీయ న్యాయ సంహిత-2023 క్రిమినల్ కోడ్ చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ నేరానికి గరిష్ఠంగా పదేండ్ల జైలు శిక్ష విధించనున్నారు. గతంలో అమల్లో ఉన్న ఐపీసీ ప్రకారం ఈ శిక్ష గరిష్ఠంగా రెండేండ్లే. అయితే కావాలని ఎవరూ ప్రమాదాలు చేయరని.. పొగ మంచు వల్ల సరిగ్గా కనిపించకపోవడం లాంటి చాలా కారణాలు ప్రమాదాలకు కారణమవుతాయని ట్రక్ డ్రైవర్లు తెలిపారు.
కొత్త చట్టం తమను నిరుత్సాహరుస్తున్నదని, ఉద్యోగాలపై భయం నెలకొల్పిందన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని లేదా శిక్షను తగ్గించాలని దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రదర్శనల వల్ల బస్టాపులతో పాటు చాలా చోట్ల ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని రాష్ర్టాల్లో ఈ ధర్నాలో ప్రైవేట్ బస్ డ్రైవర్లు, కొందరు ప్రభుత్వ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు సైతం పాల్గొన్నారు.