న్యూఢిల్లీ: మహారాష్ట్రలో జరిగే అంధేరి ఈస్ట్ ఉపఎన్నికల్లో పోటీ కోసం కావాల్సిన పార్టీ గుర్తు, పార్టీ పేరుకు సంబంధించి ఉద్దవ్ వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక జాబితాను ఇచ్చింది. ఆ జాబితాలో మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లను ప్రస్తావించింది. గుర్తుల్లో త్రిశూలం, ఉదయించే సూర్యుడు, కాగడా ఉన్నాయి. ఇక పార్టీ పేర్లుగా శివసేన (బాలాసాహెబ్ థాకరే), శివసేన (ప్రబోధంకర్ థాకరే), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) లను పేర్కొంది.
జాబితాలోని మూడు గుర్తుల్లో ఏ గుర్తు ఇచ్చినా, మూడు పార్టీ పేర్లలో ఏ పేరు ఖరారు చేసినా తమకు సమ్మతమేనని ఈసీకి ఉద్దవ్ థాకరే వర్గం తెలియజేసింది. మహాకూటమి ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి శివసేన పార్టీకి చెందిన విల్లు, బాణం గుర్తుపై ఉద్ధవ్ థాకరే, ఏక్నాథ్ షిండే వర్గాలపై వివాదం రాజుకుంది. గుర్తు తమదంటే, తమదేనని రెండు వర్గాలు పోటీపడుతున్నాయి.
ఈ క్రమంలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. పార్టీ గుర్తుపై, పేరుపైన వివాదం ఉన్న నేపథ్యంలో కొత్త పేరు, గుర్తుపైన పోటీ చేయాలని ఈసీ ఉద్ధవ్ వర్గాన్ని ఆదేశించింది. ఆ మేరకు పార్టీ పేరును, గుర్తును తమకు తెలియజేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గం ఈసీకి పార్టీ పేరుకు సంబంధించి మూడు ఆప్షన్లు, గుర్తుకు సంబంధించి మూడు ఆప్షన్లను ఇచ్చింది. కాగా, ఏక్నాథ్ షిండే వర్గం అంధేరీ ఈస్ట్‌లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తున్నది.