న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు తెలియజేసింది కేంద్ర ప్రభుత్వం దౌత్య బృందాలను పంపుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ బృందానికి దూరంగా ఉంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది. వాస్తవానికి కేంద్రం ప్రకటించిన ఎంపీల లిస్టులో.. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఉన్నారు. కానీ విదేశాలకు వెళ్లే దౌత్య బృందం నుంచి తప్పుకుంటున్నట్లు తృణమూల్ పార్టీ చెప్పింది. యూసుఫ్ పఠాన్ పేరును వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నది. తమ పార్టీని సంప్రదించకుండానే ఎలా ఎంపీ పేరును ప్రకటిస్తారని తృణామూల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తృణమూల్ పార్టీ ప్రతినిధిని ఎలా ఎంపిక చేస్తారని ఆ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. టీఎంసీ ప్రతినిధిని కేంద్రం ఎలా డిసైడ్ చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు తెలుసుకునేందుకు ముందుగా చర్చలు నిర్వహించాలన్నారు. తామేమీ ఆ మీటింగ్‌ను వ్యతిరేకించడం లేదని, జాతీయ భద్రత దృష్ట్యా ఆ అంశాన్ని రాజకీయం చేయడం లేదన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్య సందేశాన్ని ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. దానిలో భాగంగానే దౌత్య బృందాలు వివిధ దేశాలకు వెళ్లనున్నాయి.
మమతా బెనర్జీ
ఆల్ పార్టీకి చెందిన దౌత్య మిషన్‌ను బహిష్కరించడం లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె ఈ విషయంపై స్పందించారు. తమ ప్రతినిధిని పంపాలంటూ కేంద్రం నుంచి రిక్వెస్ట్ రాలేదని, ఒకవేళ ఆ అభ్యర్థన వస్తే, కచ్చితంగా ప్రతినిధిని పంపుతామని మమతా బెనర్జీ చెప్పారు. ప్రతినిధుల పేర్లు చెప్పే హక్కు పార్టీలకు ఉంటుందని, కేంద్రానిది కాదు అని ఆమె అన్నారు. కేవలం పార్లమెంటరీ పార్టీకి చెప్పడం సరికాదు అని, పాలసీ నిర్ణయాలను పార్లమెంటరీ పార్టీ తీసుకోదన్నారు.