పుణె, జూలై 17: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ఇంటి బయట అక్రమ నిర్మాణాన్ని పుణె మున్సిపల్ అధికారులు బుధవారం బుల్డోజర్తో కూల్చివేశారు. ఇంటిబయట ఉన్న ఫుట్‌పాత్‌ను ఆక్రమించి అక్రమంగా కట్టిన నిర్మాణాన్ని తొలగించాలని గతంలో నోటీసులు జారీ చేసిన అధికారులు దానిపై స్పందించకపోవడంతో కూల్చివేశారు. ఇలాఉండగా, తనను వేధించారంటూ పుణె కలెక్టర్‌పై పూజా ఫిర్యాదు చేసిన క్రమంలో ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు హాజరు కావాలంటూ పుణె పోలీసులు ఆమెకు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే ఓబీసీ, దివ్యాంగుల కోటాను దుర్వినియోగం చేసినట్టు ఆమెపై ఆరోపణలు రావడంతో ఐఏఎస్ ట్రైనీ శిక్షణను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
రాజస్థాన్‌లో మాస్ కాపీయింగ్
ప్రశ్నలకు బోర్డుపై సమాధానాలు రాసిన టీచర్లు
జైపూర్: రాజస్థాన్ స్టేట్ ఓపెన్ స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోలు గ్రామంలో ఓ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఓపెన్ స్కూల్ 10, 12 తరగతుల పరీక్షలు జరుగుతున్నాయి. ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీల కోసం ఇక్కడికి వచ్చింది. పాఠశాల గేట్లకు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో ఫ్లయింగ్ స్కాడ్ సిబ్బంది గోడలపైకి ఎక్కి, గదుల్లోకి ప్రవేశించారు. పరీక్షా పత్రంలోని ప్రశ్నలకు జవాబులను ఉపాధ్యాయులు బ్లాక్ బోర్డ్‌పై రాస్తున్నట్లు, దానిని చూసి విద్యార్థులు జవాబు పత్రాల్లో రాస్తున్నట్లు గుర్తించారు. కొందరు విద్యార్థులకు బదులుగా టీచర్లే పరీక్షలు రాస్తున్నట్లు గమనించారు. అంతేకాకుండా, ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.2,000 చొప్పున ఉపాధ్యాయులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెప్పారు.