Selfie accident : ఓ యువతి సెల్ఫీ తీసుకోబోయి 60 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశమైన బోరాన్ ఘాట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో వాటిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
ఈ సందర్భంగా కొందరు పర్యాటకులు పోటీపడి ప్రకృతి అందాలను తమ మొబైల్స్‌లో బంధిస్తున్నారు. ఈ క్రమంలో పుణెకు చెందిన ఓ పర్యాటక బృందం బోరాన్ ఘాట్ సందర్శనకు వచ్చింది. బృందంలోని నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా జారి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డు స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అధిక వర్షాల వల్ల మట్టి జారుడుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే యువత ప్రమాదకర ప్రదేశాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు.