Tragedy : ఆమె రోజులాగే సోమవారం ఉదయం కూడా తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు వెళ్లింది. బస్సు రాగానే కొడుకును ఆ బస్ ఎక్కిస్తూ విద్యుత్ షాక్‌కు గురైంది. స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించి ఆమె శరీరం నుంచి మంటలు రావడంతో భయంతో వెనుకడుగు వేశారు. ఆ తర్వాత బస్సును ముందుకు తీయించి తీవ్రంగా గాయపడిన మహిళను, ఆమె కొడుకును ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని కలబురగికి చెందిన 34 ఏళ్ల మహిళ ఎప్పటిలాగానే సోమవారం కూడా అంగ వికలుడు అయిన తన కొడుకును స్కూల్ బస్సు ఎక్కించేందుకు తీసుకెళ్లింది. కాసేపు స్టాప్‌లో వేచిచూసిన తర్వాత బస్సు రావడంతో కొడుకును బస్సు ఎక్కించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆమెకు విద్యుత్ షాక్ తగలడంతో కిందపడిపోయింది.
స్థానికులు గమనించి ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె శరీరం నుంచి మంటలు రావడం చూసి వెనక్కి తగ్గారు. వెంటనే డ్రైవర్‌ను అప్రమత్తం చేసి బస్సును ముందుకు తీయించారు. ఆ తర్వాత తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలో ఆమె కొడుకుకు కూడా గాయాలయ్యాయి. అయితే అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్కూల్ బస్సు ఆగిన చోట ఓ విద్యుత్ వైర్ తెగి వేలాడుతుండటమే ప్రమాదానికి కారణమని వారు తెలిపారు. తెగి వేలాడుతున్న విద్యుత్ వైర్ స్కూల్ బస్సుకు తగలడంతో.. బస్సు విద్యుత్ ప్రసరణ జరిగిందని, ఆ బస్సును బాధిత మహిళ పట్టుకోవడంతో విద్యుత్ షాక్‌కు గురైందని పోలీసులు నిర్ధారించారు. విద్యుత్ వైర్ వేలాడుతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.