Bengaluru | బెంగళూరు, జూలై 27: మన దేశంలో ట్రాఫిక్ జామ్ అంటే ముందుగా గుర్తు వచ్చేది బెంగళూరు. స్వల్ప దూరానికే గంటలు గంటలు వేచి చూడటం నగర పౌరులకు నిత్యం అనుభవమే. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ సమస్య ఉన్న నగరాల్లో 2023లో బెంగళూరుకు రెండో స్థానం లభించింది. మీరు వాహనంలో ప్రయాణం చేయడం కన్నా నడిచి వెళ్లడమే మంచిదంటూ గూగుల్ మ్యాప్ కూడా అప్పుడప్పుడు నిర్ధారిస్తుంది. అలాంటి అంశంపైనే ఆయుష్ సింగ్ చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ అవుతున్నది.
బెంగళూరులోని బ్రిగేడ్ మెట్రోపోలీస్ నుంచి కేఆర్ పురం రైల్వే స్టేషన్‌కు ఆరు కిలోమీటర్ల దూరం. అయితే ఈ దూరాన్ని మీరు వాహనంలో చేరుకోవాలంటే 44 నిముషాలు, నడిచి వెళ్లాలంటే 42 నిముషాల సమయం పడుతుందని గూగుల్ మ్యాప్ చూపించే సందేశాన్ని అతడు ఎక్స్‌లో షేర్ చేస్తూ ‘ఇది ఒక్క బెంగళూరులో మాత్రమే సంభవం’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో 6.2 లక్షల మంది వీక్షించగా, పలువురు చమత్కారంగా కామెంట్లు పెట్టారు.