న్యూఢిల్లీ: టైఫాయిడ్(Typhoid) జ్వరం ఇండియాలో సర్వసాధారణమైన వ్యాధిగా మారిపోయింది. అయితే యాంటీబయాటిక్ రెసిస్టాంట్ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ వ్యాధికి కావాల్సిన మందులు వాడినా.. ఆ జ్వరం కేసులు తగ్గడం లేదు. టైఫాయిడ్ సోకిన 87 శాతం కేసుల్లో .. యాంటిబయాటిక్లు పనిచేయడం లేదని, దీని వల్ల ఆయా కుటుంబీకులపై పెను ఆర్థిక భారం పడుతున్నట్లు ద లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ఈస్ట్ ఏషియా తన నివేదికలో పేర్కొన్నది. 2023లో చేపట్టిన సర్వేకు చెందిన రిపోర్టును ఆ జర్నల్ రిలీజ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం ఇండియాలో టైఫాయిడ్ చికిత్స కోసం సుమారు రూ.123 బిలియన్లు ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది. అంటే సుమారు 12 వేల కోట్ల ఆర్థికభారం ఇండియన్లపై పడినట్లు భావిస్తున్నారు.
పదేళ్ల లోపు చిన్నారుల్లో ఎక్కువగా టైఫాయిడ్ సోకుతోందని, ఆ కుటుంబాలపై ఆర్థిక భారం పడుతున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ , క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆఫ్ వెల్లోర్ పరిశోధకులు సంయుక్తంగా ఈ స్టడీ నిర్వహించారు. టైఫాయిడ్ చికిత్సకు అయ్యే ఖర్చుల్లో 91 శాతం ఇంటిసభ్యులే భరిస్తున్నారని, సుమారు 70 వేల కుటుంబాలు హెచ్చు స్థాయిలో ఖర్చు చేసినట్లు తేల్చారు. మహారాష్ట్ర, యూపీ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో సుమారు 51 శాతం ఖర్చు చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు.
కలుషిత ఆహారం, నీటి వల్ల సాధారణంగా టైఫాయిడ్ సోకుతుంది. జ్వరం, బలహీనత, తలనొప్పి, కడుపునొప్పి లాంటి లక్షణాలు వారిలో ఉంటాయి. టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్(టీసీవీ) ఇవ్వాలని పరిశోధకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టైఫాయిడ్ జ్వరం సోకిన కేసుల వల్ల భారతీయులపై ఆర్దిక భారం పడుతున్నట్లు స్టడీలో తేల్చారు. ఫ్లోరోక్వినోలిన్ రెసిస్టెన్స్ వల్ల ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుందని పరిశోధకులు చెప్పారు.
ఫ్లోరోక్వినోలిన్ మందులు వాడినా.. ఆ వ్యాధి తగ్గడం లేదని, ఆ డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లు 87 శాతం ఉన్నట్లు స్టడీ తెలిపింది. నిజానికి ఫోర్లోక్వినోలిన్ డ్రగ్ వాడితే నాలుగు రోజుల్లో తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం కూడా తగ్గుతుంది. కానీ ఆ మందు వాడినా ఇప్పుడు వ్యాధి త్వరగా తగ్గడం లేదని గుర్తించారు. దీంతో ఆర్థికభారం పెరుగుతోందని స్టడీలో పేర్కొన్నారు.