న్యూఢిల్లీ: దేశానికి చెందిన టాప్ రెజ్లర్లు మళ్లీ నిరసనకు (Wrestlers Protest) దిగారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం బైఠాయించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఏడుగురు మహిళా రెజ్లర్లు తాజాగా ఫిర్యాదు చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం కంప్లైట్ ఇచ్చారు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వారు మండిపడ్డారు. బీజేపీ నాయకుడైన ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులపై దర్యాప్తు కోసం నియమించిన కమిటీ రిపోర్ట్‌ను, మహిళా రెజ్లర్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫిర్యాదు చేసిన బాధితుల పేర్లు లీక్ కాకుండా చూడాలని కోరారు.
కాగా, బీజేపీ నేత అయిన రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై తాము ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వినేష్ ఫోగట్ మండిపడ్డారు. మరోసారి ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ‘మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉంటాం. ఇక్కడే తిని ఇక్కడే నిద్రిస్తాం’ అని అన్నారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర అధికారులను సంప్రదించేందుకు మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. తమ కెరీర్‌ను పణంగా పెట్టామని, దేశం కోసం పతకాలు సాధించామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసేంత వరకు తాము ఇక్కడి నుంచి వెళ్లబోమని టాప్ రెజ్లర్ బజరంగ్ పునియా మీడియాతో అన్నారు.
మరోవైపు రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు పలువురు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. ఆయనపై చర్యలకు డిమాండ్ చేస్తూ ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. దీంతో జనవరి 23న దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యలతో కూడిన పర్యవేక్షణ కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. నెలలోపు రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును రెండు వారాలకు పొడిగించింది. నిరసనకారుల డిమాండ్‌తో బబితా ఫోగట్‌ను ఆరో సభ్యురాలిగా కమిటీలో చేర్చింది.
కాగా, ఈ కమిటీ తన నివేదికను ఏప్రిల్ తొలి వారంలో సమర్పించింది. అయితే ఈ రిపోర్ట్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేయలేదు. అలాగే ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలను రెజ్లర్లు నిరూపించలేకపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రెజ్లర్లు మరోసారి నిరసనకు దిగారు. కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని, బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
@PMOIndia @DelhiPolice, @NCWIndia @DCPNewDelhi , @PMO_NaMo, @IndiaSports, @India_NHRC, @SupremeCourtIND, @MLJ_GoI, @timesofindia, @ThePrintIndia pic.twitter.com/cGvY9tAyie
— Vinesh Phogat (@Phogat_Vinesh) April 23, 2023