Tomato | ఓ వైపు వర్షాలు.. మరోవైపు భగ్గుమంటున్న కూరగాయల ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇందులో ముఖ్యంగా టమాటా (Tomato)ల గురించి చెప్పుకోవాలి. గత నెల రోజులుగా దీని ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటిని కొనాలంటేనే జనం బెంబేలెత్తుతున్నారు. దీని ధర డబుల్ సెంచరీ దాటి సామాన్య ప్రజల జోబులకు చిల్లుపెడుతోంది. నిత్యం వంటలో టమాటా తప్పనిసరి కావడంతో.. వాటి ధర ఎప్పుడు తగ్గుతుందా అని అంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వ్యాపారులు (Vegetable wholesalers) షాకింగ్ న్యూస్ చెప్పారు. త్వరలో టమాటా ధరలు తగ్గడం కాదుకదా.. భారీగా పెరగనున్నట్లు వెల్లడించారు. ఏకంగా కిలో టమాటా రూ.300కు చేరే అవకాశం ఉందని తెలిపారు.
టమాటా, క్యాప్సికం, ఇతర సీజనల్ కూరగాయల ధరలు భారీగా పెరగడంతో విక్రయాలు పడిపోయాయని.. దీంతో హోల్ సేల్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (APMC) సభ్యుడు కౌశిక్ తెలిపారు. హోల్ సేల్ మార్కెట్ లో కిలో రూ.160 ఉన్న టమాటా ధరలు ప్రస్తుతం రూ.220కి చేరాయని, దీంతో రిటైల్ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా కీలకమైన టమాటా ఉత్పత్తి ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మార్కెట్ లో కొరత కారణంగా ధరలు భారీగా పెరిగాయని వెల్లడించారు. ‘హిమాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షం కారణంగా కూరగాయల రవాణాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఉత్పత్తిదారుల నుంచి కూరగాయల ఎగుమతిలో సాధారణం కంటే 6 నుంచి 8 గంటల ఎక్కువ సమయం పడుతోంది. దీని కారణంగా టమాటా ధరలు దాదాపు రూ.300 కి చేరుకోవచ్చు’ అని ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండి హోల్ సేల్ వ్యాపారి (Azadpur Mandi wholesaler) సంజయ్ భగత్ (Sanjai Bhagat) తెలిపారు. అయితే, ఇదే పరిస్థితులు కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో కిలో టమాటా రూ.400కు చేరువైనా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.
హిమాచల్ ప్రదేశ్లో జులైలో భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అక్కడి నుంచి ఎక్కువగా వచ్చే క్యాప్సికం ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్లో టమాటాకు సప్లయ్, డిమాండ్ రెండూ తక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. టమాటాలు, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల ధరలు ఎక్కువ ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు.
Also Read..
Beijing | బీజింగ్ లో జలవిలయం.. వీడియోలు
Prabhas | ఆమె బిగ్గెస్ట్ సూపర్ స్టార్.. తనని ఎప్పటికీ అభిమానిస్తా : ప్రభాస్
Rashmika Mandanna | అతడితో నాకు ఎప్పుడో పెళ్లైపోయింది.. రష్మిక షాకింగ్ కామెంట్స్