న్యూఢిల్లీ, జూలై 24: ఒడిశాలోని మారుమూల గ్రామంలో పుట్టి.. ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఒడిదొడుకులను ఎదుర్కొని.. చివరికి దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్న ద్రౌపది ముర్ము.. భారత 15వ రాష్ట్రపతిగా నేడే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో సోమవారం ఉదయం 10.15 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనున్నది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతిగా ప్రమాణం చేయించనున్నారు. అంతకు ముందు తొలుత 21 తుపాకులతో ముర్ము గౌరవ వందనం స్వీకరించనున్నట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
ప్రమాణం అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి ముందు పదవీ విరమణ చేయబోతున్న ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంటుకు విచ్చేస్తారు. కాగా, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, రాష్ర్టాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలు దేశాల రాయబారులు, ఎంపీలు, ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ద్రౌపది ముర్ము నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకుంటారు. కాగా, రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసీ మహిళగా ద్రౌపది రికార్డు సాధించారు. రాష్ట్రపతుల్లోకెల్లా ద్రౌపది ముర్ము పిన్న వయస్కురాలు. అంతేకాకుండా స్వాతంత్య్రం తర్వాత జన్మించి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్నారు.
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ద్రౌపది ముర్ము కోసం సంప్రదాయ సంతాలీ చీర ఇవ్వనున్నట్టు ఆమె తమ్ముడి భార్య సుక్రీ తుడు వెల్లడించారు. ద్రౌపది సోదరుడు తరినిసెన్ తుడుతో కలసి సుక్రీ ఢిల్లీకి పయనమయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ చీరనే కట్టుకుంటే బాగుంటుందని తాను ఆశిస్తున్నానని సుక్రీ పేర్కొన్నారు. అయితే ఇదే చీర కట్టుకుంటారా అనేది తనకు కచ్చితంగా తెలియదని, రాష్ట్రపతి భవన్ వర్గాలే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.