న్యూఢిల్లీ: బస్సులో ప్రయాణించిన ఒక యువతి వాంతి చేసుకునేందుకు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది. ఇంతలో మరో వాహనం ఓవర్ టేక్ చేయడంతో ఆ రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగిపోయింది (Woman Head Crushed). ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన 20 ఏండ్ల బాబ్లీ తన అక్క, బావ వారి పిల్లలతో కలిసి కశ్మీర్ గేట్ నుంచి లూధియానా వెళ్తున్నది. హర్యానాకు చెందిన ఆర్టీసీ బస్సులో వారు ప్రయాణించారు. ఆ బస్సు అలీపూర్ ప్రాంతానికి చేరుకోగా బాబ్లీ వాంతి చేసుకునేందుకు తలను కిటికీ నుంచి బయటకు పెట్టింది. ఇంతలో ఒక వాహనం ఆ బస్సును ఓవర్ టేక్ చేసింది. ఈ నేపథ్యంలో రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగి నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం యువతి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి మరణానికి కారణమైన వాహనం కోసం పోలీసులు వెతుకుతున్నారు.