న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా, సీఏఏ రద్దును కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎంకే స్టాలిన్ హైడ్రామా నడుమ తీర్మానం ప్రవేశపెట్టారు. శరణార్ధుల పరిస్ధితితో నిమిత్తం లేకుండా వారి మతం, జాతీయత ప్రాతిపదికన వివక్ష చూపేలా సీఏఏను తీసుకువచ్చారని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మత సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూసేందుకే తమ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రతిపాదించిందని స్టాలిన్ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగంలో నిర్ధేశించిన లౌకిక నిబంధనలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు. 2019లో పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక సిద్ధాంతాలకు అనువుగా లేకపోవడంతో పాటు దేశంలో నెలకొన్న మత సామరస్యం సాఫీగా సాగేలా లేదని తమిళనాడు అసెంబ్లీ భావిస్తోందని తీర్మానం పేర్కొంది. కాగా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం, తమిళనాడు అసెంబ్లీలో విపక్ష ఏఐఏడీఎంకే వాకౌట్ చేసింది.