న్యూఢిల్లీ: వరుసగా 30 రోజులపాటు జైలులో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రిని 31వ రోజున పదవి నుంచి తొలగించడానికి ఉద్దేశించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులపై నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని(జేపీసీ) ఓ ప్రహసనంగా తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సమాజ్వాది పార్టీ అభివర్ణించాయి. తమ సభ్యులను అందులో నామినేట్ చేయడం లేదని శనివారం ప్రకటించాయి. ప్రవేశపెట్టిన దశలోనే తాము 130వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించామని, తమ దృష్టిలో అది ఓ ప్రహసనమని టీఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది.
తమ సభ్యులను జేపీసీలో నామినేట్ చేయబోమని టీఎంసీ వెల్లడించింది. సమాజ్వాది పార్టీ కూడా తమ సభ్యులను జేపీసీలో నామినేట్ చేయబోమని ప్రకటించింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ముగింపునకు ఒకరోజు ముందు ఈ మూడు వివాదాస్పద బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనతో మూడు బిల్లులను కేంద్రం జేపీసీ పరిశీలనకు అప్పగించింది.