న్యూఢిల్లీ: పార్లమెంటు ఎథిక్స్ కమిటీపై బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ముడుపులు తీసుకుని లోక్‌సభలో ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణకు గురువారం మహువా హాజరయ్యారు. అయితే విచారణ మధ్యలోనే మహువా, కమిటీలోని విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. ‘ఇదేం సమావేశం? వారంతా నీచమైన ప్రశ్నలు అడిగారు’ అని మహువా విలేకర్లతో వ్యాఖ్యానించారు. ‘నీ కళ్లలో నుంచి నీళ్లు వస్తున్నాయి’ అన్నారు. నా కళ్లల్లో నీళ్లు ఉన్నాయా? చూడండి?’ అని అన్నారు. సమావేశంపై ఆమె లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ సోన్కర్ విచారణ సందర్భంగా తనను మాటలతో వస్ర్తాపహరణం చేశారని ఆరోపించారు. వీటిని కమిటీ చైర్మన్, బీజేపీ ఎంపీ వినోద్ సోన్కర్ ఖండించారు.