న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై ఇవాళ ఢిల్లీలో సంయుక్త పార్లమెంటరీ సంఘం మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) గాయపడ్డారు. వక్ఫ్ బిల్లు సవరణ అంశంలో టీఎంసీ, బీజేపీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయతో ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో ఆవేశానికి లోనైన టీఎంసీ ఎంపీ తన చేతిలో ఉన్న గ్లాసు వాటర్ బాటిల్‌ను పగలగొట్టేశాడు. దాంతో అతని బొటనవేలు, చూపాడు వేలికి గాయాలు అయ్యాయి. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, ఆప్ నేత సంజయ్ సింగ్.. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీని చికిత్స కోసం బయటకు తీసుకువచ్చారు.
బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో జేపీసీ మీటింగ్ జరిగింది. రిటైర్డ్ జడ్జీలు, లాయర్లు ప్యానల్ ఇచ్చిన అభిప్రాయాలను ఆ సమావేశంలో చర్చించారు. అయితే శాసన ప్రక్రియలు నిపుణుల అభిప్రాయాలు ఎందుకున్న కోణంలో ఎంపీ బెనర్జీ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వక్ఫ్ సవరణ బిల్లును అధికార పార్టీ తీసుకువచ్చనట్లు ఆయన ఆరోపించారు. ముస్లిం వర్గాన్ని ఆ బిల్లుతో టార్గెట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో బీజేపీ నేతలు ఆ బిల్లును సమర్థించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో సంస్కరణలు అవసరం అన్నారు. డిజిటైజేషన్, ఆడిటింగ్, లీగల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం ఉంటుందని అధికారి పార్టీ వాదించింది. వక్ఫ్ బిల్లు సవరణపై ఇప్పటి వరకు జేపీసీ కేవలం ఢిల్లీలోనే 15 మీటింగ్‌లు నిర్వహించింది. మరో అయిదు మీటింగ్‌లను ఇతర నగరాల్లో ఏర్పాటు చేసింది.