ఢాకా: భారత్‌కు బంగ్లాదేశ్ క్రమంగా దూరమవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమంటూ ప్రధాని మోదీకి బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) లేఖ రాశారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో లేఖను పోస్ట్ చేశారు.
ఈద్-ఉల్- అధా సందర్భంగా మహమ్మద్ యూనస్‌కు, బంగ్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని తెలిపారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని మోదీ అన్నారు.
దీనికి స్పందిస్తూ యూనస్ మరో లేఖ రాశారు. ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని అందులో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని చెప్పారు.
— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025