భోపాల్, అక్టోబర్ 17: తెలంగాణతోపాటు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. టికెట్ దక్కని ఆశావహుల మద్దతుదారులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో నెలకొన్న టికెట్ పంచాయితీకి సంబంధించి ఒక వీడియో వైరల్‌గా మారింది. రాష్ట్రంలోని శివపురి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వీరేంద్ర రఘువంశి మద్దతుదారులు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కమల్‌నాథ్ మాట్లాడుతూ ‘వెళ్లి పార్టీ సీనియర్ నేతలైన దిగ్విజయ్ సింగ్, జయవర్ధన్ సింగ్ బట్టలు చింపి.. మీ నిరసన తెలుపండి’ అంటూ ఉసిగొల్పారు. వీరేంద్రకు టికెట్ దక్కాలని తాను కోరుకుంటున్నానని అనడం వీడియోలో ఉన్నది.
ఈ వీడియో రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమల్‌నాథ్ వ్యాఖ్యలపై మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ తీవ్రంగానే స్పందించారు. ఒక కుటుంబం పెద్దది అయినప్పుడు ఉమ్మడి సంతోషాలు, విభేదాలు ఉంటాయని మంగళవారం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. పెద్దలు విభేదాలను ఓపిగ్గా పరిష్కరించుకోవాలని వివేకం చెబుతుందంటూ కమల్‌నాథ్‌ను ఉద్దేశించి చురకలంటించారు.