న్యూఢిల్లీ, జూన్ 13 : డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మరో కీలక ముందడుగు వేసింది. ఈనెల 10, 11వ తేదీల్లో 3 క్షిపణి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో భారత్ తన స్వదేశీ క్షిపణి తయారీలో కీలక ముందడుగు వేసిందని చెప్పుకోవాలి. ఈ టెస్టుల్లో డీఆర్డీవో బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ క్షిపణి ప్రయోగాలతో పాటు.. యాంటీ షిప్ వార్ ఫేర్‌లో కొత్త టెక్నాలజీ ప్రయోగాల్లోనూ సక్సెస్ సాధించింది.
5 వేల కి.మీ అవతల శత్రువున్నా..
చండీగఢ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి, అధునాతన ఇంటర్ సెప్టర్ క్షిపణులను అధికారులు ప్రయోగించారు. ఈ ఇంటర్ సెప్టర్ వ్యవస్థలు 2 వేల కిలోమీటర్లు, 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉండే శత్రువుల బాలిస్టిక్ క్షిపణులను కూడా గురి చూసి ధ్వంసం చేయగలవు. ఖండాంతర క్షిపణులను కూడా టార్గెట్ చేసి ధ్వంసం చేయగల సామర్థ్యంతో వీటిని డీఆర్డీవో రూపొందించింది. దీంతో బీఎండీ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ చేరినట్టు అయింది.