Srinagar | నూతన సంవత్సర వేళ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది భక్తులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడిన విషయం విదితమే. ఈ ఘటనపై విచారించడానికి ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. అసలు ఏం జరిగిందన్న విషయంపై వారం రోజుల్లోగా ఈ కమిటీ తన నివేదికను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ కమిటో హోంశాఖ ప్రధాన కార్యదర్శి, పోలీస్ ఏడీజీ ముఖేశ్ సిన్హాతో పాటు డివిజనల్ కమిషనర్ రాజీవ్ లంగర్ సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు పూర్తి విచారణ చేసి, ప్రభుత్వానికి వారం రోజుల్లోగా ఓ నివేదికను సమర్పిస్తారని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
నూతన సంవత్సరం ప్రారంభం రోజునే వైష్ణోదేవి ఆలయంలో ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 12 మంది భక్తులు మృతి చెందగా, 20 మంది భక్తులు గాయపడ్డారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తెల్లవారుఝామున తొక్కిసలాట జరిగింది.