న్యూఢిల్లీ: ఫరీదాబాద్‌లో జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌తో సంబంధం ఉన్న వైట్ కాలర్ ఉగ్ర మాడ్యుల్‌పై జమ్ము కశ్మీరు, ఫరీదాబాద్ పోలీసులు జరిపిన దాడి తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్ర గ్రూపు దాడి చేసేందుకు ఎంచుకున్న లక్ష్యాలలో మూడు కీలక ప్రదేశాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి జరపాలని ఉగ్ర మాడ్యుల్ నిర్ణయించింది. అదేవిధంగా జనసమ్మర్ధంతో ఉండే న్యూఢిల్లీలోని ఆజాద్ మండి, అహ్మదాబాద్‌లోని నరోడ పండ్ల మార్కెట్లో బాంబు పేలుళ్లు సృష్టించి భారీగా ప్రాణనష్టం కలిగించాలన్నది ఈ ఉగ్ర గ్రూపు దురాలోచనగా తెలుస్తోంది.
ఇది నిఘా వైఫల్యమే!
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీ బాంబు పేలుడు ఘటన ఢిల్లీ పోలీసులు, ప్రధాన భద్రతా, నిఘా వర్గాల వైఫల్యాలను స్పష్టంచేస్తున్నది. ఇటీవల జమ్ముకశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్త బృందం ఫరీదాబాద్‌లో 2,900 కేజీల పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, పేలుడును అంచనా వేయడంలో ఘోరంగా విఫలం కావడం విమర్శలకు దారితీస్తున్నది.అంత మందుగుండు సామగ్రితో కూడిన కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించి, మూడు గంటల పాటు అక్కడ ఎలా ఉందో ఢిల్లీ పోలీసులు సమాధానం చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.