Supreme Court | గౌహతి, కర్నాటక హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు సహా ముగ్గురు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసింది. కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సూచించింది. మాజీ సీజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ హృషికేశ్ రాయ్ ఇటీవల పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే. ఖాళీలను నియమించేందుకు ముగ్గురి పేర్లను చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ బేలా ఎం త్రివేది సైతం జూన్ 9న పదవీ విరమణ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 1993లో కొలీజియం వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. ఈ వ్యవస్థ కింద సుప్రీంకోర్టులోని అగ్రశ్రేణి ఐదుగురు న్యాయమూర్తులు.. సుప్రీంకోర్టు, 25 హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీ, పదోన్నతులను సిఫారసు చేస్తారు. ఇదిలా ఉండగా.. జస్టిస్ బీవీ నాగరత్న కొలీజియం సభ్యురాలిగా నియమితులయ్యారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా పదవీ విరమణ తర్వాత.. అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు కొలీజియంలో చేరారు. ఆమె అక్టోబర్ 29, 2027న సీజేఐగా పదవీ విరమణ చేసే వరకు కొలీజియంలో కొనసాగనున్నారు. ప్రస్తుతం కొలీజియం సభ్యుల్లో చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నాగరత్న ఉన్నారు.