శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మంగళవారం డిస్మిస్ చేశారు. దేశ భద్రత దృష్ట్యా రాజ్యాంగంలోని 311(2)(సి) ప్రకారం ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేసే క్లర్క్, ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక స్కూల్ టీచర్‌ను సస్పెండ్ చేసినట్టు ఎల్జీ కార్యాలయం పేర్కొంది. ఈ ముగ్గురికి లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నాయని తెలిపింది.
పంజాబ్‌లో పాక్ గూఢచారి అరెస్ట్
చండీగఢ్: ‘ఆపరేషన్ సిందూర్’ జరుగుతుండగా భారత సైన్యం కదలికలు, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు పంపిన గగన్‌దీప్ సింగ్ వురపు గగన్‌ను అరెస్ట్ చేశారు. ఈ సమాచారంతో కూడిన మొబైల్ ఫోన్‌ను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే సమాచారాన్ని పాక్ ఐఎస్ఐ ఏజెంట్లకు అందజేశాడని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. మరోవైపు, పాక్‌కు సమాచారం చేరవేస్తున్న రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి షకుర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.