Encounter | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది మరణించగా.. మరొకరు గాయపడ్డారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లోకి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన కాల్పుల్లో ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి రికవరీ చేశారు. బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ డీఆర్జీ దంతేవాడ, బీజాపూర్ బృందాలు, ఎస్టీఎఫ్, కోబ్రా యూనిట్లు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల గురించి కూంబింగ్ చేస్తున్న క్రమంలో.. బలగాల రాకను గుర్తించిన మావోలు కాల్పులు జరిపారు. ఆ తర్వాత భద్రతా బలగాలు సైతం ధీటుగా బదులిచ్చాయి. ఎన్‌కౌంటర్‌ను బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పీ ధ్రువీకరించారు. సంఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ రైఫిల్స్, 303, ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుగా ధ్రువీకరించారు. చనిపోయిన మావోయిస్టులను గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్కౌంటర్లో హెడ్ కానిస్టేబుల్ మోను వడాడి, కానిస్టేబుల్ దుకారు గొండే, కానిస్టేబుల్ రమేశ్ సోరీ ప్రాణాలు కోల్పోయారని, ముగ్గురు బీజాపూర్ డీఆర్జీకి చెందినవారని అధికారులు తె లిపారు. సోమ్‌దేవ్ యాదవ్ గాయపడగా.. ప్రథమ చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాట్లాడుతూ సంఘటనా స్థలాన్ని చుట్టుముట్టామని.. ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మరిన్ని బలగాలను సైతం మోహరించామన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని.. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలగాలు కూంబింగ్ చేపట్టినట్లుగా వివరించారు. ఆపరేషన్ పూర్తయ్యాక వివరాలు విడుదల చేయనున్నట్లు ఐజీ తెలిపారు.