న్యూఢిల్లీ, మే 5: అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తున్న ఓ విలాసవంతమైన క్రూయిజ్ (టూరిస్ట్) నౌకలో ముగ్గురు వ్యక్తులు అంతుబట్టని వ్యాధితో మరణించటం సంచలనంగా మారింది. దీనిపై వెంటనే రంగంలోకి దిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘హంటావైరస్’ బారినపడటం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఆదివారం ధృవీకరించింది. మొత్తం ఆరుగురు వ్యక్తులు తీవ్ర అనారోగ్యం బారిన పడగా, ముగ్గురు మృతిచెందారు.
మరో ముగ్గురు దక్షిణాఫ్రికాలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ సాధారణంగా ఎలుకల నుండి మానవులకు సంక్రమిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అత్యంత ఖరీదైన ‘ఎంవీ హొండియస్’ నౌకను డచ్‌కు చెందిన కంపెనీ నడుపుతున్నది. దీంట్లో ప్రయాణిస్తున వారికి ఎలుకల నుంచి వైరస్ సోకటం ఎవరికీ అంతుబట్టడం లేదు. అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి కేప్వెర్డ్కు వెళ్తున్న ఈ నౌకలో మొత్తం 170 మంది ప్రయాణికులు, 70 మంది సిబ్బంది ఉన్నట్టు తెలిసింది.