బెంగళూరు, జూలై 24: కర్ణాటక హైకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ దుబాయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చిందని కోర్టు పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు ఆరుగురు జడ్జీలను చంపుతామంటూ ఒక అంతర్జాతీయ ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్కు సందేశం వచ్చిందని పీఆర్వో మురళీధర్ తెలిపారు. ఈ నెల 12న వచ్చిన సందేశం ప్రకారం.. పాకిస్థాన్లోని ఓ బ్యాంక్ ఖాతాకు రూ.50 లక్షలు పంపాలని లేదా ఆరుగురు జడ్జీలను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. దీనిపై ఈ నెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. దీనిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.