న్యూఢిల్లీ, ఆగస్టు 21 : కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో 45 రోజులపాటు నిరసనలకు వేదికైన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం మరో భారీ ప్రదర్శన జరిగింది. కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేల సంఖ్యలో నిరసనకారులు తాజా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రధానంగా అగ్రవర్ణాలకు చెందిన ఈ నిరసనకారులు యూజీసీ సమానత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడంతోపాటు కుల ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్ విధానంలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ రిఫార్మ ఆందోళన్ ఆధ్వర్యంలో నీట్ అభ్యర్థి మర్ష్ దూబే నాయకత్వంలో శుక్రవారం జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రాజస్థాన్‌కు చెందిన జనరల్ సేన, చాణక్య సేనలతోపాటు కర్ణిసేన కూడా పాల్గొన్నాయి.
అయితే ఈ ప్రదర్శన నిర్వహణకు అనుమతి విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఇన్ఫ్లుయెన్సర్ అజీత్ భారతి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిరసనకారులు హనుమాన్ చాలీసా పఠిస్తూ సియావర్ రామచంద్ర కీజై అని నినాదాలు చేశారు. ఇలాఉండగా, రిజర్వేషన్ హటావో ఆందోళన్(ఆర్‌హెచ్‌ఏ) అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఇచ్చిన పిలుపు మేరకు జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షంగా నిరసనలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. నెలరోజుల క్రితమే తాము దరఖాస్తు చేసుకున్నామని, చివరి నిమిషంలో తమకు జంతర్ మంతర్ వద్ద కాకుండా రామ్‌లీలా మైదాన్‌లో నిరసనకు పోలీసులు అనుమతి ఇచ్చారని ఆర్‌హెచ్‌ఏ ప్రతినిధులు తెలిపారు. జంతర్ మంతర్ వద్దనే శాంతియుతంగా ఆందోళన నిర్వహించడానికి తమను అనుమతించాలని వారు ఆందోళనకు దిగారు.
కాగా, నిరసనకారులు కోరిన మేరకు జంతర్ మంతర్ వద్ద కాకుండా రామ్‌లీలా మైదాన్‌లో నిరసన కార్యక్రమం జరుపుకోవాలని పోలీసులు తమ అనుమతి పత్రంలో పేర్కొన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా నిరసన కార్యక్రమానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొంటూ సాయంత్రం 4 గంటల వరకు రామ్‌లీలా మైదానంలో గరిష్ఠంగా 500 మంది గుమికూడేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇలా ఉండగా కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తలపెట్టిన నిరసన నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. శుక్రవారం ఉదయం కొంతమంది నిరసన స్థలం వద్ద గుమికూడగా ఎటువంటి అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని వెంటనే అక్కడి నుంచి పంపించివేశారు. కాగా జంతర్ మంతర్ వద్ద నిరసన కోసం నెల రోజుల క్రితమే అనుమతి కోరామని ఆర్‌హెచ్‌ఏ తెలిపింది. శుక్రవారం మధ్యా హ్నం 12 గంటలకు హఠాత్తుగా వేదికను జంతర్ మంతర్ నుంచి రామ్‌లీలా మైదానానికి మార్చారని, ఇందులో పాల్గొనేవారి సంఖ్యను 500కి పరిమితం చేశారని ఆర్‌హెచ్‌ఏ ఢిల్లీ పోలీసులపై ఆగ్రహం ప్రకటించింది.