జమ్ము: జమ్ములో వేల మంది రోజూవారీ కూలీలు రోడ్డెక్కారు. జల్‌శక్తి శాఖకు చెందిన వీళ్లంతా తమ డిమాండ్ల సాధన కోసం భారీ ర్యాలీ చేపట్టారు. రోజూవారీ కూలీలుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు నెరవేర్చాలని వారం నుంచి ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవటంతో బుధవారం రోడ్డు, వంతెనలను బ్లాక్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సెక్రటేరియట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రభుత్వం తప్పుడు హామీలతో కాలయాపన చేస్తున్నదని, ప్రభుత్వం పట్టించుకోకపోతే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూలీల నాయకుడు రవి హాన్స్ తెలిపారు. కాగా, అక్కడి జల్‌శక్తి శాఖలో దాదాపు 60 వేల మంది రోజూవారీ కూలీలు పనిచేస్తున్నారు. వారి డిమా ండ్లు నెరవేర్చటంలో బీజేపీ, లెఫ్టినెంట్ గవర్నర్ విఫలం కావటంతో కూలీలు భారీ ర్యాలీ చేపట్టారు.