ముంబై, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్రలోని థానే జిల్లాలో దాదాపు 40 వేల మంది విద్యార్థులు మూడు రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న పాఠశాలలకు భోజనాన్ని సరఫరా చేసే బ్రిక్స్ కంపెనీ కాంట్రాక్టు ఈ నెల 15తో ముగిసింది. కొత్త కాంట్రాక్టర్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.
దీంతో విద్యార్థుల్లో కొందరు సొంత ఖర్చులతో భోజనం చేస్తున్నారు. మిగిలినవారు దాతల ఔదార్యంపై ఆధారపడుతున్నారు. ఈ పరిస్థితిని తెలుసుకున్న మానవ హక్కుల సంరక్షణ సమితి, భీమ్ పాంథర్ పార్టీ నేతలు సాంఘిక సంక్షేమ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుకేశిని తెల్గోటే దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. సుకేశిని వెంటనే స్పందించి, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మెస్లను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.