గువాహటి: అసోం రాష్ట్రం ఒకప్పుడు మయన్మార్‌లో భాగంగా ఉండేదంటూ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాష్ట్ర చరిత్ర తెలియకపోతే అసలు మాట్లాడొద్దని మండిపడ్డారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదనలు వినిపిస్తూ.. అసోం గతంలో మయన్మార్ (బర్మా) లో భాగంగా ఉండేదని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు అసోం సీఎంకు ఆగ్రహం తెప్పించాయి. అసోం చరిత్రపై అవగాహన లేనప్పుడు మాట్లాడటం ఎందుకని ఆయన ఘాటుగా విమర్శించారు. అసోం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని, ఒకానొకప్పుడు అసోంకు, మయన్మార్‌కు మధ్య గొడవలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అసోం మయన్మార్‌లో భాగంగా ఉందని చరిత్రలో ఎక్కడా రాసి ఉన్నట్లు తాను చూడలేదని మండిపడ్డారు.