Maharastra CM | మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి కొత్త సీఎం అభ్యర్థిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండే.. సీఎం ఎంపికపై బీజేపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో ఢిల్లీలోనూ, ముంబైలోనూ పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ కొత్త సీఎం ఎవరన్న విషయమై ఒక కొలిక్కి రాలేదు. మహాయుతి కూటమిలో అధిక సీట్లు గెలుచుకున్నందున ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉండాలని బీజేపీ ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కొత్త పేరు తెర మీదకు వచ్చింది. కేంద్ర మంత్రి మురళీధర్ మొహోల్ పేరు తదుపరి మహారాష్ట్ర సీఎం కానున్నారని వార్తలొచ్చాయి.
డిసెంబర్ ఐదో తేదీన కొత్త ప్రభుత్వం కొలువు దీరుతుందని బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే శనివారం ప్రకటించారు. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రధాన పోటీదారుగా ఉన్నా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మాదిరిగా బీజేపీ అగ్ర నాయకత్వం ఆశ్చర్యకరంగా మరో నేతను ముందుకు తీసుకు వస్తుందన్న చర్చ వచ్చింది.
ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన, సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ పేరు బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో తన పేరు బయటకు రాగానే కేంద్ర మంత్రి మురళీధర్ మొహోల్ స్పందించారు. మహారాష్ట్ర సీఎం పదవికి తన పేరు ప్రస్తావనకు రావడం కేవలం ఊహ మాత్రమేనని, అనవసర చర్చేనని కొట్టి పారేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ సారధ్యంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడిందని, రాష్ట్ర ప్రజలు చారిత్రక మెజారిటీ అప్పగించారని చెప్పారు.