శ్రీనగర్: ఇవాళ ఐటీ అధికారులు ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించింది అన్న కక్షతోనే.. ఆ మీడియా సంస్థపై కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా ఈ అంశంపై స్పందించారు. మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో మీడియాను కూడా కేంద్రం అణగదొక్కుతున్నదని ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. తాజాగా బీబీసీపై ఐటీ దాడులు కూడా అందులో భాగమేనని ఆయన మండిపడ్డారు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నందుకే కేంద్రం ఆ మీడియా సంస్థపై కక్ష గట్టిందని ఆరోపించారు.